Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఇంకా కలగానే ఉంది. ఆయన లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు పునీత్. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మరణించి 20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయనని మరిచిపోలేకపోతున్నారు కన్నడిగులు.
తాజాగా సంస్మరణ సభ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప సహా ఎంతో మంది రాజకీయ నాయకులు పునీత్ సంస్మరణ సభలో కనిపించారు. సినీ ఇండస్ట్రీ అంతా ఈ సభలో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచు మనోజ్ ఒక్కడే కనిపించాడు. తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ వేదికపై చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు.
2017లో వచ్చిన రాజకుమార సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ తండ్రిగా నటించాడు శరత్ కుమార్. సంతోష్ ఆనందనం తెరకెక్కించిన ఆ చిత్రం రూ.75 కోట్లు వసూలు చేసి కన్నడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్‌లోనూ నటిస్తున్నాడు శరత్ కుమార్. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన బదులు తాను చనిపోయినా బాగుండేది అంటూ ఎమోషనల్ అయ్యాడు శరత్ కుమార్.
పునీత్ నా శ్రద్ధాంజలికి వస్తాడనుకున్నా.. ఎందుకంటే నాకు 67 ఏళ్లు.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది.. అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ దేవుడు పునీత్ రాజ్‌కుమార్ బదులు తనను తీసుకెళ్లినా బాగుండు అంటూ స్టేజిపైనే ఏడ్చేశాడు శరత్ కుమార్. ఈయన మాటలు పునీత్ సంస్మరణ సభలో చాలా మంది కంట కన్నీరు పెట్టించాయి.