సీనియర్ నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. అప్పట్లో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ చాలా వరకు సినిమాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేశారు. శరత్‌బాబు సుమారుగా 200కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. ఇక ఈయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. కాగా ఈయన 1951 జూలై 31వ తేదీన జన్మించారు. అప్పటి మద్రాస్ రాష్ట్రంలోని ఆముదాల వలస ఈయన జన్మస్థలం.
శరత్ బాబు సినిమా కెరీర్ తెలుగులోనే మొదలైనప్పటికీ తమిళంలోనూ ఆయన గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక శరత్ బాబు 8 నంది అవార్డులను సాధించారు. ఈయన సీనియర్ నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. తరువాత కొన్నేళ్లకు విడాకులు ఇచ్చారు. అయితే శరత్ బాబు సినిమాల్లో కనిపించి చాలా రోజులే అయింది. ఈయన చివరిసారిగా పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. అయితే శరత్ బాబు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆహారపు అలవాట్లు, జీవనశైలి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఉదయం తాను అందరూ తిన్నట్లు ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ తిననని, కేవలం పండ్లు మాత్రమే తింటానని చెప్పారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి వ్యాయామం చేస్తానని అన్నారు. ఇక మధ్యాహ్నం భోజనంలో కేవలం మిల్లెట్స్‌ను మాత్రమే తింటానని.. రాత్రి భోజనంలో పుల్కా ఏదైనా కూర, టిఫిన్స్ తింటానని చెప్పారు. తాను తెల్ల అన్న తినడం మానేసి చాలా ఏళ్లవుతుందని అన్నారు.
ఇక నాన్ వెజ్‌ను తినడం తాను ఎప్పుడో మానేశానని శరత్ బాబు తెలిపారు. ఒక జీవిని చంపి తినే హక్కు మనుషులకు లేదని.. అదే సిద్ధాంతాన్ని నమ్మాను కనుకనే నాన్ వెజ్ అసలు ముట్టుకోనని చెప్పారు. కాగా శరత్ బాబు ప్రస్తుతం సినిమాలు ఏవీ చేయడం లేదు. కానీ ఆయన ఆహారపు అలవాట్లు తెలుసుకున్న నెటిజన్లు మాత్రం షాకవుతున్నారు.