Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ సమంత. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. దాంతోపాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సమంత మొదటి తెలుగు సినిమా.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేశావే. ఈ సినిమాలో జెస్సీగా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి.. ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నేడు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. ఈ క్రమంలో అమ్మడి అప్‌కమింగ్ సినిమాల విషయంలో సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. శాకుంతలం చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్‌ను వదిలింది. ఇందులో శకుంతలగా కనిపించిన సామ్ ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంది. మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్న అనంతరం డబ్బింగ్ పూర్తి చేసిందట సామ్. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. ఇందులో బన్నీ కూతురు అర్హ కీలక పాత్ర పోషించింది.
ఇక సమంత నటిస్తున్న మరో చిత్రం యశోద. సమంత బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. యశోద ఫస్ట్ గ్లింప్స్ ని మే 5న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత హిందీలో కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలో సమంత తాను బాలీవుడ్ లో నటించబోయే ప్రాజెక్ట్స్ ప్రకటించనుంది. కొంత కాలంగా సమంత ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో కూడా హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది నాగ చైతన్య నుంచి విడిపోవడం అభిమానులకు బిగ్ షాక్. విడాకుల తర్వాత సమంత సినిమాల విషయంలో ఇంకా జోరు పెంచింది. ఈ అమ్మడు నటించిన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం కన్మణి రాంబో ఖతీజా నేడు విడుదలైంది.