Sai Pallavi : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. అందం, అభినయంతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. సాయి పల్లవి మలయాళ చిత్రం ప్రేమమ్ తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఫిదా సినిమాలో నటించింది. ఇందులో భానుమతి పాత్రలో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టి పడేసింది. ఆ తర్వాత సాయి పల్లవికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇటు తెలుగుతోపాటు అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవల శ్యామ్ సింగరాయ్ తో అలరించిన సాయి పల్లవి ప్రస్తుతం షూట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె రైతుగా మారింది. తన ఇంటి వద్ద ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ పనులు చేసింది. మిగతా కూలీలతో కలిసి పంట కోత పనుల్లో పాల్గొంది. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్‌స్టా వేదికగా షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం షూటింగ్స్ నుండి గ్యాప్ దొరకడంతో సాయి పల్లవి తన ఇంటి వద్ద ఉన్న పొలాల్లోకి వెళ్ళింది. అక్కడి వ్యవసాయ కూలీలతో కలిసి పని చేసింది. అక్కడి వ్యవసాయ కూలీలు అల్లం పంటని బయటకి తీస్తుండగా సాయి పల్లవి కూడా వారితో చేరి అల్లం పంటని బయటకి తీసింది.
రోజంతా వారితో కలిసి పని చేసింది. పొలంలో ఉన్న కూలీలతో కలిసి ఫోటోలు తీసుకొని, అల్లం పంటతో ఫోటోలు తీసుకుని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సాయి పల్లవి. ఈ ఫోటోలని షేర్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇక నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు సాయి పల్లవిపై పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సాయి పల్లవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలకు టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. హార్ట్ సింబల్ ఇచ్చింది. నీలా ఎవ్వరూ లేరు.. అంటూ శ్రద్ధా శ్రీనాథ్ ప్రశంసల వర్షం కురిపించింది.