Saakini Daakini : రెజీనా కస్సాండ్రా, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించిన శాకిని డాకిని సినిమా అప్పుడే ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. 2017 లో వచ్చిన మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ సూపర్ హిట్ చిత్రానికి అనువాదంగా రూపొందిన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదలైన శాకిని డాకిని చిత్రం రెండు వారాలకే ఓటీటీ తలుపు తట్టబోతుంది. సెప్టెంబర్ 30 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుంది.
ఈ విషయంలో కొందరు నెటిజన్లు చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. సినిమా విడుదలైన 2 వారాలకే ఓటీటీలో విడుదల చేసేట్లయితే థియేటర్లలో విడుదల చేయడం ఎందుకని విమర్శిస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేస్తామని ప్రకటించడం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా థియేటర్లలో విడుదల చేశారు. అయినప్పటికీ ఫ్లాప్ గానే మిగిలి పోయింది.

మరోవైపు కొరియాలో సూపర్ హిట్ అయిన సినిమా స్టోరీని తీసుకొని రీమేక్ పేరుతో దానిని చెడగొట్టారని పలువురు విమర్శిస్తున్నారు. రెజీనా కస్సాండ్రా, నివేదా థామస్ ల ఓవర్ యాక్షన్.. అలాగే కథ కథనాల్లో లోపాలు, విడుదలకు ముందు మగవాళ్లపై రెజీనా చేసిన వాఖ్యలు.. ఇలా వివిధ అంశాలు సినిమా పరాజయం అవడానికి కారణాలుగా చెబుతున్నారు. ఇక ఓటీటీ ప్రేక్షకులను ఈ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.