RRR Movie : ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా మేనియానే నడుస్తోంది. అందరూ ఈ మూవీ గురించే చర్చించుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ పై సహజంగానే అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే సినిమా విడుదలైనప్పటి నుంచి హవా కొనసాగిస్తోంది. ఇప్పటికీ కలెక్షన్ల సునామీని సృష్టిస్తూనే ఉంది. ఇక ఏ మూవీ విడుదల అయినా నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని అభిమానులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఒక అప్‌డేట్ మాత్రం బయటకు వచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు వెండి తెరపై వీక్షించారు. ఈ క్రమంలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీకి చెందిన తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్‌లకు గాను జీ5 యాప్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. కనుక ఆయా వెర్షన్‌లను జీ5 యాప్ లో స్ట్రీమ్ చేస్తారు. అలాగే హిందీ వెర్షన్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను నిర్మాతతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీని రెండు నెలల తరువాతే ఓటీటీలో విడుదల చేయనున్నారట. అందువల్ల ఈ మూవీ మే 25వ తేదీన ఓటీటీలో విడుదల అవుతుందని తెలుస్తోంది. అయితే హిందీలో మాత్రం 3 నెలలకు రిలీజ్ చేయాలని డీల్ చేసుకున్నారట. కనుక నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌లో ఈ మూవీ వస్తుంది. అందువల్ల అప్పటి వరకు హిందీ ప్రేక్షకులు వేచి చూడక తప్పదు. ఇక దీనిపై త్వరలోనే జీ5, నెట్ ఫ్లిక్స్‌లు ఒక ప్రకటనను విడుదల చేస్తాయని సమాచారం. కాగా మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే రూ.500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రికార్డులను తిరగరాస్తోంది.