Redmi 6A : ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి మన దినచర్యలో భాగం అయిపోయాయి. మనం ఏ పని చేస్తున్నా సరే ఫోన్ మన వెంటే ఉంటోంది. అందులో అనేక పనులను చక్కబెట్టుకుంటున్నాం. అలాగే వినోదాన్ని కూడా పొందుతున్నాం. అయితే కొన్ని సార్లు పలు కంపెనీలకు చెందిన ఫోన్లు పేలుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 6ఎ ఫోన్ పేలింది. దీంతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో నివాసం ఉండే మన్‌జిత్ అనే వ్యక్తి బంధువు ఒక మహిళ రాత్రి పూట రెడ్‌మీ 6ఎ ఫోన్‌ను తల దగ్గర పెట్టుకుని నిద్రించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ ఫోన్ పేలింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న ఆ మహిళకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే సదరు మన్‌జిత్ ఒక యూట్యూబర్ కావడంతో ఈ విషయాన్ని అతను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. దీంతో స్పందించిన షియోమీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు కస్టమర్ సేఫ్టీ ముఖ్యమని పేర్కొంది. అంతేకాదు.. సంఘటన జరిగిన చోటుకు తాము వెళ్తున్నామని.. అసలు ఏం జరిగిందో తెలుసుకుని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలియజేసింది. అయితే గతంలోనూ పలు సంఘటనల్లో షియోమీ ఫోన్లు పేలాయి. కానీ మరీ ఇంత తీవ్రంగా ఎవరైనా మరణించిన దాఖలాలు లేవు. కాగా తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో మరోమారు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.