Tiger Nageshwar Rao : మాస్ మహారాజా రవితేజ మంచి దూకుడు మీదున్నాడు. ఆయన ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమా ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ చిత్ర షూటింగ్ పూర్తి చేసి రిలీజ్‌కి సిద్ధంగా ఉంచాడు. ఇక రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా అనే చిత్రాలు కూడా చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే పేరుతో కూడా సినిమా చేయనున్నాడు. ఇవి కాకుండా తాజాగా తన 71వ సినిమాకి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు.
వంశీ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ‘అక్కడ దొంగలు, దోపిడీదారులు ఉండేవారు. అదే విధంగా టైగర్ నాగేశ్వరరావు కూడా’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు.
1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. ఇప్పుడు ఆయన జీవిత నేపథ్యంలో రవితేజ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథ పలువురు హీరోల దగ్గరకు వెళ్లి చివరకు రవితేజ దగ్గరకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రవితేజ రూ.18 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. దొంగాట సినిమా అందించిన దర్శకుడు వంశీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. అభిషేక్ నామా ఈ సినిమాకు నిర్మాత. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.