Rana Daggubati : హీరోగా మాత్రమే కాదు నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. కెరీర్ మొదట్లోనే తెలుగుతో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు పాన్ ఇండియా సినిమా బాహుబలిలో విలన్ రోల్ చేశాడు. ఇక సినిమా సినిమాకు తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉన్నాడు రానా. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో చేసిన విరాటపర్వంతో చివరిసారి ప్రేక్షకులను పలకరించాడు దగ్గుబాటి హీరో.
ఈ సినిమాలో ఆయన నటన బాగున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు. ఇందులో రానా యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా తర్వాత రానా కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. దానికి కారణం ఆయన భార్య మిహిక. రానా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల.. ఆమెకు టైం కేటాయించలేకపోతున్నాడట. అందుకే కొంతకాలం గ్యాప్ తీసుకొని పూర్తిగా తన భార్యకే సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

ఈ క్రమంలోనే ఆయన ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దానికోసం రానా ఏకంగా రూ.20 కోట్లు వదులుకున్నట్లు సమాచారం. ఇటీవల రానా ఇన్ స్టాలో పోస్టులన్నీ డిలీట్ చేసి, సోషల్ మీడియానుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. భార్యతో సమయం గడపడం ముఖ్యమే కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఏంటా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకొందరు రానాకు మిహిక అంటే ఎంతిష్టమో అంటూ కామెంట్ చేస్తున్నారు.