Ram Gopal Varma : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై లేదా వ్యక్తులపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అవి వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే వర్మ ఇటీవలి కాలంలో సినిమాల కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోమారు వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. దీనిపైనే వర్మ వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో మొత్తం రానానే కనిపిస్తాడని అన్నారు. పవన్ ట్రైలర్ లాంటివాడని, రానా సినిమా లాంటి వాడని అన్నారు. ఇక భీమ్లా నాయక్‌ను హిందీలో రిలీజ్ చేస్తే అక్కడి ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవుతారని.. విలన్ ఎవరో గుర్తు పట్టలేరని.. ఎందుకంటే సినిమా మొత్తం రానా కనిపిస్తాడని.. రానా బాహుబలి ద్వారా హిందీ ప్రేక్షకులకు ఇప్పటికే తెలుసు కాబట్టి.. ఈ సినిమాలో రానాను చూసి అతన్నే హీరోగా ప్రేక్షకులు భావించే అవకాశం ఉందని అన్నారు.
ఇక మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా భీమ్లా నాయక్‌ను తెరకెక్కించిన విషయం విదితమే. ఈ చిత్రం కోసం పవన్‌కు అనుగుణంగా, తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథలో త్రివిక్రమ్ పలు మార్పులు చేశారు. అయితే దీనిపై కూడా వర్మ కామెంట్లు చేశారు. పవన్ కోసం కథలో ఎన్ని మార్పులు చేసినా.. సినిమా మొత్తం రానానే కనిపిస్తాడని అన్నారు. ఈ క్రమంలోనే వర్మ కామెంట్లు పవన్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.