Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎల్లప్పుడూ వివాదాల్లోనే చిక్కుకుంటుంటారు. ఆయన చేసే కామెంట్లు.. పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. అది అల్లాటప్పా వివాదం ఏమీ కాదు. సాక్షాత్తూ కాబోయే రాష్ట్రపతి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే.. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఖరారు అయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఎన్‌డీఏకు బలం ఉంది కనుక ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం లాంఛనమే కానుంది. అయితే ఆమెపై వర్మ వివాదాస్పద పోస్టు పెట్టారు.
ద్రౌపది రాష్ట్రపతి అయితే మరి ఆమెకు పాండవులు ఎవరు ? అసలు ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అని వర్మ ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ ఆయన ట్వీట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నాయకులు రాజాసింగ్, రాకేష్ రెడ్డిలు వర్మపై మండిపడ్డారు. ఒక దళిత మహిళ, అందులోనూ కాబోయే రాష్ట్రపతిని పట్టుకుని అంతలా అవమానిస్తావా.. అంటూ వారు ఆయనపై ఫైరయ్యారు. ఈ క్రమంలోనే వివాదం చెలరేగింది.

అయితే తన తప్పు తెలుసుకున్న వర్మ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తాను ఆమెను అవమానించాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తనకు మహాభారతంలోని ద్రౌపది పాత్ర అంటే ఎంతో ఇష్టమని.. ఆ పాత్రకు రిఫరెన్స్ ఇస్తూ మాత్రమే అలా ట్వీట్ చేశానని.. అంతేకానీ ఆమెను అవమానించాలని.. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని వర్మ అన్నారు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. బీజేపీ నాయకులు వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేపు పెట్టాలని చూస్తున్నారు. దీంతో వర్మ చాలా సీరియస్ ట్రబుల్‌లో పడిపోయారని చెప్పవచ్చు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.