Rajeev Kanakala : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ నటించిన ప్రతి ఒక్క సినిమాలో రాజీవ్ నటించారు. ఎన్టీఆర్ కథను సిద్ధం చేసేటప్పుడే రాజీవ్ కనకాల కోసం ఒక ప్రత్యేక పాత్ర రాయించుకునే వారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉందని చెప్పవచ్చు. గత కొంత కాలం నుంచి వీరిద్దరూ కలిసి సినిమాలలో కనిపించకపోయేసరికి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రాజీవ్ కనకాల.. తనకు, ఎన్టీఆర్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఎన్టీఆర్ సినిమాలో నటించాలంటే నా కోసం కథ మార్చాల్సి రావడంతో అంత ఇబ్బంది ఎందుకని నేనే సినిమాలలో నటించడంలేదని తెలియజేశారు. ఇక ఈ సందర్భంలోనే ఎన్టీఆర్ తో తనకున్న స్నేహ బంధాన్ని వివరిస్తూ గతంలో ఒక సినిమా షూటింగ్ జరిగే సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా తామిద్దరం చనిపోయేవాళ్లమని షాకింగ్ విషయాలు చెప్పారు.
ఎన్టీఆర్ నటించిన నాగ సినిమా షూటింగ్ సమయంలో ఒక రైలుపై యాక్షన్ సన్నివేశాన్ని తీయాల్సి ఉంది. అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా రైలు కదలడంతో ఒక్కసారిగా కింద పడిపోయాము. అయితే పక్కనే ఇనుప స్తంభాలు ఉండడంతో వాటిని పట్టుకొని బ్రతికి బయటపడ్డామని, లేకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో రాజీవ్, తారక్ ఉండేవారు కాదని.. సంచలన విషయాలను తెలియజేశారు.