Pushpaka Vimanam Review : విజయ్ దేవరకొండ సినిమాల్లో చాలా త్వరగా సక్సెస్‌ను సాధించినప్పటికీ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాత్రం ఇంకా సక్సెస్ రుచి చూడలేదు. పలు మూవీల్లో నటించినప్పటికీ అవి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. కానీ ఆనంద్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మరోమారు ఆనంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పుష్పక విమానం పేరిట శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే..
పుష్పక విమానం పాత సినిమా ఒకటుంది. అందులో కమలహాసన్, అమల నటించారు. అయితే ఆ సినిమా కథ వేరు, ఇప్పటి సినిమా కథ వేరు. పుష్పక విమానం 2021 మూవీని కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోవర్ధన రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు. ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘన హీరో, హీరోయిన్లుగా నటించారు.
చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) మీనాక్షిని పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లయిన రెండో రోజే మీనాక్షి పారిపోతుంది. దీంతో సుందర్‌కు ఇబ్బందులు మొదలవుతాయి. తన భార్య పారిపోయిందనే విషయాన్ని బయటకు చెప్పలేకపోతుంటాడు. ఆమె ఇంట్లో ఉన్నట్లే బయటి వారందరికీ చెప్పి నమ్మిస్తుంటాడు. అయితే తన భార్యగా నటించేందుకు ఒక లేడీ ఆర్టిస్ట్‌ను అతను ఏర్పాటు చేసుకుంటాడు. తరువాత ఏమైంది ? అన్న వివరాలు తెలియాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఈ మూవీలో కామెడీకి పెద్ద పీట వేశారు. భార్య పారిపోయిందనే విషయాన్ని బయటి ప్రపంచానికి చెప్పలేక, ఆమె ఉన్నట్లు నమ్మించలేక సుందర్ పడే పాట్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక పోలీసు అధికారి పాత్రలో సునీల్ కూడా తన పరిధి మేర నటించి మెప్పించాడు. ఈ క్రమంలో సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కొనసాగుతుంది. ఇక చివర్లో ఉండే ట్విస్ట్‌కు ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారు. మొత్తానికి సినిమా ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. కామెడీని కోరుకునే వారు ఒకసారి తప్పక ఈ మూవీని చూడవచ్చు.