Tollywood : గత కొంత కాలంగా టాలీవుడ్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఓటీటీల ప్రభావం వల్ల.. సినిమాలు బాగున్నప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. కొన్ని రోజులు పోతే ఓటీటీల్లోనే చూడవచ్చు కదా.. అని భావిస్తున్నారు. దీంతో సినిమాలకు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మంచి సినిమా అని ముద్ర వేసుకున్నా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. దీంతో నిర్మాతలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాలకు భారీగా నష్టాలు వస్తున్నాయి.
సినిమా టిక్కెట్ల ధరలను పెంచితే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. మొదటికే మోసం వచ్చింది. అంతకు ముందు కన్నా ఇప్పుడే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రముఖ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త సెన్సేషన్‌ను సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నిర్మాతలు ఇదే విషయంపై గత కొద్ది రోజులుగా సమాశాలు నిర్వహిస్తూ.. చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చారు.

అయితే ఎప్పటి వరకు షూటింగ్‌లను నిలిపివేస్తారు.. అన్న విషయంపై మాత్రం వారు స్పష్టతను ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటినీ చర్చించి పరిష్కరించాకే షూటింగ్‌లను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఏది ఏమైనా కరోనా అనంతరం సినిమా రంగ పరిస్థితులు దారుణంగా మారాయి. కలెక్షన్లు లేక థియేటర్లు, నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి పరిష్కారం కనుగొంటారో.. లేదో.. చూడాలి.