Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ఓటమి తర్వాత ఆయన రాజీనామా చేయగా, ప్యానెల్ సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తూ వచ్చిన ప్రకాశ్ రాజ్ ఇటీవల ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో తన కుటుంబానికి సంబంధించిన పలు విషయాలను చెప్పుకొచ్చారు.
తనకు ముగ్గురు పిల్లలు అని ప్రకాశ్ రాజ్ చెప్పుకు రాగా, పెద్దమ్మాయి పూజ .. తనకి 25 ఏళ్లు .. షికాగో యూనివర్సిటీలో ఎంఏ ఫైన్ ఆర్ట్స్ ను పూర్తి చేసింది. తను వెస్ట్రన్ క్లాసికల్ సింగర్. తన కాళ్లపై తాను నిలబడింది. నా ఫామ్ హౌస్ లను తనే చూసుకుంటుంది. రెండో అమ్మాయి మేఘన.. తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఏఆర్ రెహ్మాన్ అకాడమీలో మ్యూజిక్ నేర్చుకుంటోంది. చిన్నబ్బాయ్ వేదాంత్.
అంతకుముందు ఒక అబ్బాయి ఉండేవాడు సిద్ధార్థ్ . అతను ఒకసారి చెన్నైలోని మా ఇంటిపై గాలిపటం ఎగరేస్తూ పడిపోయాడు. అప్పుడు పెద్ద గాయమైంది. ఆ తరువాత అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేవి. హఠాత్తుగా ఒక రోజున చనిపోయాడు.. అంటూ ఆవేదన చెందారు ప్రకాశ్ రాజ్. ఇక తన మొదటి భార్య పేరు లత కాగా, కొన్ని కారణాల వలన విడాకులు తీసుకోవలసి వచ్చిందని అన్నారు. నా మొదటి భార్య లత. పోనీ వర్మ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం నా అదృష్టం.. అని చెప్పుకొచ్చారు.