Pooja Hegde : ఎంతటి సెలబ్రిటీలు అయినా సరే కొన్ని సార్లు విమాన ప్రయాణాలు చేసినప్పుడు వారికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు కొందరు చూసీ చూడనట్లు వెళ్లిపోతారు. కొందరు మాత్రం ఈ విషయాన్ని నలుగురికీ చెబుతారు. తాజాగా పూజా హెగ్డె కూడా అలాగే చేసింది. ఆమెకు తాజాగా విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో అప్‌సెట్ అయిన బుట్టబొమ్మ తనకు ఏం జరిగిందో వివరించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది.
పూజా హెగ్డె తనకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలియజేసింది. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది విపుల్ నకాషే అనే వ్యక్తి తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేసింది. తన పట్ల అతను ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని మండిపడింది. ముంబై నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో అతను తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. ఎలాంటి కారణం లేకున్నా.. తనతో అహంకారంగా, అజ్ఞానంగా మాట్లాడాడని.. తనను బెదిరింపులకు గురి చేశాడని.. ఆమె ఆరోపణలు చేసింది. అయితే ఇలాంటి విషయాలను తాను అంతగా పట్టించుకోనని.. కానీ తాజాగా జరిగింది మాత్రం భయంకరంగా ఉందని.. పూజా హెగ్డె ట్వీట్ చేసింది.

అయితే పూజా ట్వీట్‌పై సదరు విమాయాన సంస్థ స్పందించింది. తన స్టాఫ్ పేరు, వివరాలతోపాటు తన ఫ్లైట్, టిక్కెట్ నంబర్, పీఎన్ఆర్ నంబర్ తదితర వివరాలను తెలియజేయాలని.. వెంటనే అతనిపై చర్యలు తీసుకుంటామని.. ఈ విషయంలో సారీ చెబుతున్నామని.. ఇండిగో సంస్థ స్పష్టం చేసింది. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే పూజా ట్వీట్ మాత్రం వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె ఇటీవలే ఆచార్యలో నటించగా.. అది బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అంతకు ముందు వచ్చిన బీస్ట్, రాధే శ్యామ్ చిత్రాలు కూడా ఫెయిలయ్యాయి. దీంతో త్వరలో రానున్న మహేష్ చిత్రంపైనే ఈమె నమ్మకం పెట్టుకుంది. ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఎఫ్3 మూవీలో ఐటమ్ సాంగ్‌లోనూ మెరిసింది.