Pawan vs Posani : రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలతో దుమారం చెలరేగుతోంది. ఆయన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులతోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. ఏపీ ఫిలిం చాంబర్ అయితే ఏకంగా తమకు, పవన్ వ్యాఖ్యలతో సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగతమని ఏకంగా లేఖను విడుదల చేసింది. అయితే మధ్యలో ఆశ్చర్యంగా పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

పవన్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం, అందుకు మంత్రులు ప్రతి విమర్శలు చేయడం.. అంతా బాగానే ఉంది. కానీ మధ్యలో సడెన్ గా పోసాని ఎందుకు వచ్చారు ? ఆయన ఈ మ్యాటర్‌లో కలగజేసుకుని మరీ పవన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది ? పవన్ ఫ్యాన్స్ గురించి తెలిసి కూడా పోసాని ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు ? ఆయనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు ఇచ్చారు ? అన్న సందేహాలు వస్తున్నాయి.
అయితే పవన్ ఏపీ ప్రభుత్వంతోపాటు సీఎం జగన్‌ను విమర్శించారు కనుక ఓ వైసీపీ కార్యకర్తగా పోసాని స్పందించారు అనుకోవచ్చు. కానీ సాధారణ విమర్శలతో సరిపెడితే పోయేది. అయితే పోసాని కాస్తంత ఘాటుగానే ముందుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం చెలరేగింది. ఆయన అసలే పోసాని. ఆగ్రహం వచ్చినా, ప్రేమ కలిగినా అత్యంత భారీ స్థాయిలు ఆయన మాట్లాడుతారు. అందుకనే పవన్‌పై ఆగ్రహం చెంది ఆ విధంగా మాట్లాడారేమోనని అనుకోవచ్చు.

అయితే మొదటి సారి ఆయన మాట్లాడినప్పుడు కాస్తంత ఘాటుదనం ప్రదర్శించినా బూతులు వాడలేదు. కానీ పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఎప్పుడైతే ఆయనకు కాల్స్ చేసి బెదిరించడం, మెసేజ్ లు పెట్టడం చేశారో అప్పుడే పోసానికి కాలి ఉంటుంది. అందుకనే ఆయన రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ అత్యంత దారుణంగా మాట్లాడారు. బూతులను వాడారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఇంకా భగ్గమంటున్నారు.
అయితే పోసానిపై దాడి చేసేందుకు జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ యత్నించారు. ఇది కూడా పోసాని ఆగ్రహావేశాలకు కారణమైనట్లు తెలుస్తోంది. కానీ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన భాషపై వైసీపీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అలా మాట్లాడి ఉండకూడదని, బాధ కలగడం సహజమని, విమర్శలతో తిప్పి కొట్టాలని అంటున్నారు.

కానీ కొందరు మాత్రం పోసాని వెనుక ఎవరో ఉన్నారని, కావాలనే ఆయనతో ఇలా మాట్లాడిస్తున్నారని, అది చూసుకునే ధైర్యంతో పోసాని రెచ్చి పోయి మాట్లాడుతున్నారని.. అంటున్నారు. లేకపోతే ఆయన ఇలా మాట్లాడడని అంటున్నారు. పవన్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మధ్యలో పోసానికి సంబంధం లేదు కదా.. కానీ ఆయనను కావాలనే ఎవరో తెరపైకి తెచ్చి ఆయనతో ఇలా వ్యాఖ్యలు చేయిస్తున్నారని అంటున్నారు. అయితే ముందు ముందు పరిణామాలు ఎలా మారుతాయోనని ఉత్కంఠ నెలకొంది.