Pawan Kalyan : స్వయంకృషి, స్వీయ ప్రతిభే ఆయన కెరీర్ కు పునాది రాళ్లు. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత. బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు. అశేష అభిమానులకు ఆయన మెగాస్టార్. ఈ ఆదివారం 67వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు.
మనసున్న మారాజు అన్నయ్య చిరంజీవి గారు అంటూ.. నేను ప్రేమించే, గౌరవించే.. ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను.. అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు. గ్రామీణ భారతదేశం కోసం పనిచేసే ఒక మేథావి నుంచి బర్త్ డే సందేశాన్ని ఫార్వార్డ్ చేస్తున్నాను. చిరంజీవి గారు నాకు ఒక ఎమోషన్. ఆయన రుద్రవీణ సినిమా నాపై ప్రభావాన్ని చూపింది. ఆ సినిమా నన్ను భారతదేశంలోని గ్రామాల గురించి తెలుసుకునేలా.. వాటి కోసం పని చేసేలా చేసింది. దయచేసి చిరంజీవి గారికి హృదయపూర్వక బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేయండి.. అంటూ పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు.

అలాగే సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్.. నా ఇన్‌స్పిరేషన్.. నా ప్రియమైన మామ.. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి. మీరు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలని.. జీవితంలోని ప్రతి రంగంలోనూ మాకు ఇలా స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.