Marriage : ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు తమ కళ్ల ముందే చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఉండే వ్యథ అంతా ఇంతా కాదు. తమకు వృద్ధాప్యంలో కొండంత అండగా ఉంటారనుకునే పిల్లలకు తామే తలకొరివి పెట్టాల్సి రావడం.. అంతకన్నా మించిన శోకం తల్లిదండ్రులకు ఇంకొకటి ఉండదు. ఆ తల్లిదండ్రులకు కూడా ఆ కొడుకు అలాంటి శోకాన్నే మిగిల్చాడు. అయితే కొడుకు పోయిన దుఃఖాన్ని మరిచిపోలేని ఆ దంపతులు అతనికి ఏకంగా గుడి కట్టి పూజిస్తున్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన భూక్యా లాలు, సుక్కమ్మ దంపతులకు రాంకోటి అనే కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉంది. కాగా రాంకోటి అదే తండాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తమకు పెళ్లి చేయమని తమ పెద్దలను వారు అడిగారు. అయితే వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన రాంకోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో అతని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ సంఘటన జరిగింది.. 2003లో.
ఆ తరువాత ఒక రోజు తల్లి సుక్కమ్మకు తన కుమారుడు రాంకోటి కలలో కనిపించాడు. ప్రతి శ్రీరామనవమి రోజు తనకు పెళ్లి చేయాలని కోరాడు. దీంతో ఆ దంపతులు తమ ఇంటి ఆవరణలోనే ఉన్న ఖాళీ స్థలంలో తమ కొడుక్కి గుడి కట్టారు. అందులో తమ కుమారుడు రాంకోటితోపాటు ఓ యువతి విగ్రహాన్ని వారు ఏర్పాటు చేశారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలా వారి విగ్రహాలను అలంకరించారు. అనంతరం ఆ తండా వాసుల సమక్షంలో పెళ్లి చేశారు.
ఇలా ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు తమ కుమారుడు కోరినట్లు వారు అతని విగ్రహానికి కల్యాణం జరిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరామనవమి రోజున తమ బంధుమిత్రులు, స్థానికుల సమక్షంలో మరోమారు రాంకోటికి కళ్యాణం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.