Jio : టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఒక సంచలనం. జియో దెబ్బకు అనేక ఇతర టెలికాం కంపెనీలు మూత పడ్డాయి. వొడాఫోన్, ఐడియా అయితే విలీనం అయి కూడా జియో పోటీని తట్టుకోలేకపోయాయి. ఎయిర్‌టెల్ కాస్తో కూస్తో నెట్టుకొస్తోంది. అయితే జియో వల్ల రిలయన్స్‌కు ఎంతటి పేరు వచ్చిందో.. ఇప్పుడు ఆ సంస్థ విడుదల చేసిన కొత్త ఫోన్ వల్ల అంతటి చెడ్డ పేరు కూడా వస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
రిలయన్స్ జియో సంస్థ.. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌తో కలిసి జియోఫోన్ నెక్ట్స్ పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్‌ను వినాయకచవితి రోజున లాంచ్ చేస్తామని ప్రకటించారు. కానీ.. చిప్‌ల కొరత కారణంగా దీపావళికి లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీపావళికి నాలుగైదు రోజుల ముందుగానే ఈ ఫోన్‌ను లాంచ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. కానీ ధర విషయంలోనే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు.
జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.3499కే అందిస్తామని హింట్లు ఇచ్చారు. దీంతో అత్యంత చవక ధరకు ఆండ్రాయిడ్ ఫోన్‌ను కొనవచ్చని ఎదురు చూసిన వినియోగదారులకు నిరాశే ఎదురైంది. ఈ ఫోన్ ధరను రూ.6499గా ప్రకటించారు. కానీ వాస్తవానికి ఇంతకన్నా తక్కువ ధరకే ఇంతకన్నా బెటర్ ఫీచర్లు కలిగిన ఫోన్లు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో వినియోగదారులకు చిర్రెత్తుకొచ్చింది.
మార్కెట్‌లో ఇంతకన్నా తక్కువ ధరకే ఇంతకన్నా బెటర్ ఫీచర్లు ఉన్న ఫోన్లు ఉన్నాయి, మీ జియో ఫోన్ నెక్ట్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైగా ఫోన్‌ను ఈఎంఐ రూపంలో కొనే వెసులుబాటును కూడా కల్పించారు. కానీ ఈఎంఐ పూర్తిగా చెల్లించే సరికి వాస్తవానికి కొన్ని ప్లాన్లలో రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ మేరకు నెటిజన్లు కూడా లెక్కలు చెబుతున్నారు. అవును.. కావాలంటే వారు చెబుతున్న కింద లెక్క ఒక్కసారి చూడండి.
Jio
జియో ఫోన్ నెక్ట్స్ ధర రూ.6499. ఈఎంఐలతో కొంటే ముందుగా రూ.1,999 చెల్లించాలి. మరో రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనం. 18/24 నెలల ప్లాన్‌లలో దేన్నో ఒకదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 24 నెలల ప్లాన్‌లో నెలకు రూ.450 ప్లాన్‌ను తీసుకుని ఉదాహరణగా లెక్కిస్తే.. ఈ ప్లాన్‌లో నెలకు 1.5 జీబీ డేటా వస్తుంది. ఇదే ప్లాన్‌ను సాధారణ రీచార్జి ప్లాన్‌లో చూసుకుంటే రూ.199 అవుతుంది. అంటే.. రూ.450 లో రూ.199 నెలవారీ ప్లాన్ అనుకున్నా.. మిగిలిన రూ.251 ఫోన్‌కు ఈఎంఐ అనుకోవచ్చు. దీన్ని 24 నెలలకు లెక్క వేస్తే.. 24 * 251 = రూ.6024 అవుతాయి. దీనికి రూ.1,999 అడ్వాన్స్, రూ.501 ప్రాసెసింగ్ ఫీజు కలిపితే.. 6024 + 1999 + 501 = రూ.8524 అవుతాయి. అంటే ఇదే రేటుకు ఇప్పుడే ఏదైనా ఫోన్‌ను కొంటే ఇంకా మంచి ఫీచర్లతో ఫోన్‌ను పొందవచ్చు. కానీ.. ఇంత రేటు పెట్టి.. జియో ఫోన్ నెక్ట్స్ నే ఎందుకు కొనాలి ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇక జియో ఫోన్ నెక్ట్స్‌ను రూ.6499 చెల్లించి కూడా కొనలేమని, రూ.6299 కే వేరే మంచి మోడల్స్ అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.3499 కు అందిస్తామని ఊదరగొట్టారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జియో ఫోన్ నెక్ట్స్‌ను ఈఎంఐల రూపంలో తీసుకుంటే నెలకు రూ.300 మొదలుకొని రూ.600 వరకు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5.45 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ (ప్రగతి ఓఎస్), డ్యుయల్ సిమ్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.. వంటి ఫీచర్లను అందిస్తున్నారు.
జియోఫోన్ నెక్ట్స్‌ను దీపావళి కానుకగా విడుదల చేయగా.. నవంబర్ 4వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయిస్తారు. జియో మార్ట్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, పార్ట్‌నర్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. తొలుత 3 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు తమకు సమీపంలో ఉన్న జియో స్టోర్ కోసం వాట్సాప్‌లో హాయ్ అని 7018270182 అనే నంబర్‌కు మెసేజ్ పంపితే చాలు, సమాచారం వస్తుంది.