Nassar : ప్రముఖ నటుడు నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెలుగుతోపాటు తమిళం, ఇతర దక్షిణాది భాషలకు చెందిన ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎన్నో హిట్ చిత్రాల్లో ఈయన నటించారు. నటుడిగా ఎంతో గుర్తింపు పొందారు. కామెడీ పాత్రలతోపాటు నెగెటివ్ పాత్రలు, సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక బాహుబలి సినిమాలో అయితే ఈయన బిజ్జలదేవుడిగా అదరగొట్టేశారు. ఈ క్రమంలోనే ఆయనకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా లభించింది.
నాజర్ తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషలకు చెందిన అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈయన గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. నాజర్ సినిమాల నుంచి తప్పుకోనున్నారట. ఇకపై ఆయన సినిమాల్లో నటించేది లేదని నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే అంతటి గుర్తింపు పొందిన నటుడు అయి ఉండి.. ఈయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. అని అందరూ షాకవుతున్నారు.

నాజర్ కు వయస్సు మీద పడింది. అందులోనూ ఇది కరోనా కాలం. అందువల్ల ఆయన షూటింగ్‌ల నిమిత్తం బయట తిరుగుతూ రిస్క్ తీసుకోదలచుకోలేదట. ఇప్పటికే పలువురు సీనియర్ సెలబ్రిటీలు కరోనా బారిన పడి చనిపోయారు. కనుక కరోనా బారిన పడకూడదని చెప్పి ఆయన సినిమాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. అందువల్ల నాజర్ త్వరలో దీని గురించి ఏమైనా చెబుతారేమో చూడాలి. ఏది ఏమైనా అలాంటి నటుడు ఇండస్ట్రీకి దూరం అవుతున్నాడంటే.. నిజంగా అది విచారకరమైన విషయం అనే చెప్పాలి.