Nara Lokesh : సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెదేపా నాయకుడు పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఏపీలోని పలు టీడీపీ ఆఫీస్ లపై దాడులు చేసిన విషయం విదితమే. అయితే దీనిపై వైసీపీ నాయకులు స్పందించారు. దాడికి పాల్పడింది టీడీపీ వాళ్లేనని.. తమపై తామే దాడులు చేయించుకుని ప్రజల్లో సానుభూతి పొందడం చంద్రబాబుకు అలవాటైన పనే అని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ సంఘటనలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందించారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. పెంపుడు కుక్కలను తమపై దాడికి పంపుతారా ? అని ప్రశ్నించారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ దాక్కున్నారని ఆరోపించారు. దమ్ముంటే బయటకు వచ్చి తమను ఎదుర్కోవాలని, ప్లేస్, టైమ్ చెప్పాలని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు చేసే దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని లోకేష్ అన్నారు.
కాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బుధవారం బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. మరిన్ని నిరసన కార్యక్రమాలను రాష్ట్రమంతటా చేపట్టింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గురువారం నుంచి 36 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు చెప్పారు.