Murali Mohan : సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. కానీ మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే ఆయన సమంత, నాగచైతన్యలపై కామెంట్స్ చేశారు. తన నుంచి కొన్న అపార్ట్‌మెంట్‌లోనే వారు ఉండేవారని.. అయితే ఒక రోజు పనిమనిషి వచ్చి వారు విడాకులు తీసుకుంటున్నారనే విషయం చెప్పిందని.. దీంతో షాకయ్యానని మురళీ మోహన్ అన్నారు. అయితే ఎంతో అన్యోన్యంగా కనిపించే వారు విడాకులు ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ అర్థం కాలేదని మురళీ మోహన్ వివరించారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఆయన పవన్ కల్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 18 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకున్న విషయం విదితమే. అయితే ఆయన తరువాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తరువాతే జనసేన ఉద్భవించింది. ఈ క్రమంలోనే పవన్ 2019 ఎన్నికల్లో ఏపీలో రెండు చోట్ల పోటీ చేసినా ఒక్క చోట కూడా గెలవలేదు. అయితే పవన్ ఇప్పుడు సీఎం కాలేకపోయినా.. ఎప్పుడో ఒకసారి తప్పక సీఎం అవుతారని.. మురళీ మోహన్ అన్నారు. పవన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. చిరంజీవి చేసినట్లు పవన్ తన పార్టీని దేంట్లోనూ విలీనం చేయరని అన్నారు. పవన్ సీఎం అయితే మొదటగా తామే సంతోషిస్తామని.. ఒక సినీ కళాకారుడు సీఎం అయ్యాడని గర్వపడతామని మురళీ మోహన్ అన్నారు.

ఇక తాను గతంలో రాజమండ్రిలో బీజీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు పవన్ కూడా తన తరఫున ప్రచారం చేశారనే విషయాన్ని మురళీ మోహన్ గుర్తు చేశారు. పవన్ కచ్చితంగా ఏదో ఒక రోజు సీఎం అవుతారన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. అయితే పవన్ సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలనే ఈమధ్య చేశారు. ఏపీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన పార్టీని దేంట్లోనూ విలీనం చేయబోనని స్పష్టం చేశారు. తన పార్టీ అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటు వేయాలని కోరారు. ఇక పవన్ త్వరలోనే ఏపీలో 6 నెలల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.