Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేష్ అంబానీ ఓ సరికొత్త ఖరీదైన కారును కొనుగోలు చేశాఉ. రోల్స్ రాయ్స్ కంపెనీకి చెందిన కల్లినన్ అనే మోడల్ కారును ఆయన ఏకంగా రూ.13.14 కోట్లు వెచ్చించి మరీ కొన్నారు. దీంతో దేశంలోని వీఐపీలు వాడుతున్న అత్యంత ఖరీదైన కార్లలో ఇదొకటిగా నిలిచింది.

కాగా ఈ కారు అసలు ధర రూ.6.95 కోట్లు. కానీ దీన్ని ముకేష్ అంబానీకి తగినట్లుగా మోడిఫై చేశారు. దీంతో దీని ధర రూ.13.14 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ కారును రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరిట జనవరి 31వ తేదీన రిజిస్టర్ చేశారు. దక్షిణ ముంబైలోని టార్‌డియో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో కారును రిజిస్టర్ చేశారు.
ఇది పెట్రోల్ మోడల్ కారు కాగా.. దీని బరువు సుమారుగా 2.5 టన్నుల వరకు ఉంటుంది. 564 బేసిక్ హార్స్ పవర్‌ను ఈ కార్ అందిస్తుంది. దీనికి గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ప్రత్యేక ఫ్యాన్సీ నంబర్‌ను కూడా కొనుగోలు చేశారు. అయితే అంబానీ కోరుకున్న నంబర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్‌టీవో వారు కొత్త సిరీస్‌ను ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో 0001 అనే నంబర్‌కు గాను రూ.12 లక్షలు చెల్లించి మరీ రిజిస్టర్ చేశారు.
కాగా రోడ్ సేఫ్టీ ట్యాక్స్ కింద రూ.40వేలను చెల్లించారు. అయితే ఇప్పటికే అంబానీ గ్యారేజ్‌లో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ ఆయన కోసం ప్రత్యేకంగా ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన సెక్యూరిటీ కోసం నియమించిన సిబ్బందికి గాను ప్రత్యేకంగా రూపొందించిన మోడిఫైడ్ బీఎండబ్ల్యూ కారును ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.