OTT : ప్రతి వారంలో శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్తగా విడుదలకాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్ ఫామ్ ల వైపు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా, డిస్నీ హాట్ స్టార్, సోనీ లివ్ లాంటి వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న వెబ్ సిరీస్ లు, సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నందినీ రాయ్, నోయల్ జంటగా ముఖ్య పాత్రల్లో నటించగా ఆంథాలజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తెలుగు సినిమా పంచతంత్ర కథలు నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం ఆగస్టు 31 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అవబోతుంది. ఇంకా తమిళంలో రాచ్చసన్, తెలుగులో రాక్షసుడు పేర్లతో విడుదలై మంచి విజయం సాధించిన సినిమా ఇప్పుడు కట్ పుత్లీ పేరుతో హిందీలో రీమేక్ చేయబడింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేసింది. ఇక ఈ మూవీ కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది.

అలాగే కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా చేసిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ విక్రాంత్ రోణా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ ఫలితాన్నే రాబట్టింది. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 2 నుండి జీ5 ఓటీటీలో ముందుగా కన్నడ భాషలో ప్రసారం కానుంది. ఇక తెలుగు, హిందీ భాషలలోనూ కొద్ది రోజుల తరువాత విడుదల చేస్తారని సమాచారం.
అంతే కాకుండా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్రాంచైస్ నుండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రింగ్స్ ఆఫ్ పవర్ అనే వెబ్ సిరీస్ కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళం, ఇంగ్లిష్ మొదలైన భాషలలో సెప్టెంబర్ 2 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. ఇక ప్రభుదేవా ముఖ్య పాత్రలో నటించిన చిన్న పిల్లల సినిమా మై డియర్ భూతం చిత్రం కూడా జీ5లో సెప్టెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇలా పలు మూవీలు, సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.