మాజీ ఉప ముఖ్యమంత్రి, జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వివాదాలు వదలడం లేదు. మొన్నీ మధ్యే ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలకు చీరలను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళలందరికీ భర్త లాంటి వారని అన్నారు. దీనికి మహిళలు పెద్ద ఎత్తు ఆందోళన చేపట్టారు.
అయితే మరుసటి రోజే రాజయ్య తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఇక ఈ వివాదం సద్దు మణిగింది.. అనుకుంటున్న తరుణంలో ఆయన తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బతుకమ్మ ఆడిన ఆయన చెప్పులు వేసుకుని పాల్గొనడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బతుకమ్మ పండుగ బుధవారం నుంచి ప్రారంభం కాగా ఓ కార్యక్రమంలో తాటికొండ రాజయ్య పాల్గొని బతుకమ్మ ఆడారు. ఆయనతోపాటు మరో ఇద్దరు నాయకులు కూడా కాళ్లకు చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడారు. దీంతో వారిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ ఆట పాటలో చెప్పులు వేసుకుని పాల్గొనడం ఏమిటని ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన దీనిపై స్పందించాల్సి ఉంది.