Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో మంచు విష్ణు గెలిచి అధ్యక్ష పీఠం ఎక్కిన తరువాత ఆయనపై అనేక సార్లు అనేక మంది విమర్శలు చేశారు. విష్ణు మా సభ్యులకు సొంత బిల్డింగ్ ను సొంత ఖర్చులతో కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను ఇంకా ఎందుకు నెరవేర్చలేదని కొందరు ఆయనను ప్రశ్నించారు. అలాగే ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయమై ఎందుకు స్పందించడం లేదని కూడా విష్ణుపై కొందరు ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆ సమస్యలు లేవు. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. ఈక్రమంలోనే సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో మంచు విష్ణు గతంలో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయని కొందరు అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలని, సినీ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు హీరోలు, దర్శకులు వెళ్లి సీఎం జగన్‌ను కలిశారు. అయితే మా అధ్యక్షుడిగా ఉండి కూడా ఈ సమస్యపై ఎందుకు ప్రయత్నం చేయడం లేదని కొందరు అప్పట్లో విష్ణును విమర్శించారు. కానీ ఆయన టిక్కెట్ల ధరలను పెంచినంత మాత్రం సినీ రంగ సమస్యలు పోవని పరోక్షంగా అన్నారు. అయితే అప్పటి నుంచి ఆయనపై ట్రోల్స్, విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు నిజం అయ్యాయని అంటున్నారు. సినిమా టిక్కెట్ల ధరలను ఇప్పుడు పెంచారు.. కానీ థియేటర్లకు జనాలు రావడం లేదు.. అంటే చాలా మంది ధరల పెంపును ఇష్టపడడం లేదని స్పష్టమైంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.

ఆచార్య మూవీ ఫ్లాప్ అయినా, సర్కారు వారి పాట హిట్ అయినా.. రెండు సినిమాలకు చాలా థియేటర్లలో తొలి రోజు నుంచి టిక్కెట్లు సులభంగానే లభ్యం అయ్యాయి. అనేక థియేటర్లలో సీట్లు ఖాళీగానే ఉన్నాయి. సాధారణంగా అగ్ర హీరోల సినిమాలకు మొదటి మూడు నాలుగు రోజుల వరకు అసలు టిక్కెట్లు దొరకవు. కానీ ఆ సినిమాలకు అలాంటి పరిస్థితి కనిపించలేదు. టిక్కెట్లు సులభంగానే లభ్యం అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే టిక్కెట్ల ధరల పెంపు కారణంగానే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేదని స్పష్టమైంది. అందువల్ల టిక్కెట్ల ధరలను పెంచినా పెద్దగా ప్రభావం లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే విష్ణు కూడా అప్పట్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. టిక్కెట్ల ధరలను పెంచినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అన్నట్లుగా కామెంట్లు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు నిజం అయ్యాయని అంటున్నారు.
ఇక తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఆయన సినిమా టిక్కెట్ల ధరలపై కామెంట్స్ చేశారు. తాను మా అధ్యక్షుడిగా ఉండి కూడా ఈ విషయంలో కలగజేసుకోనందుకు కొందరు తనను విమర్శించారని అన్నారు. అయితే టిక్కెట్ల ధరలను పెంచాలి అన్నవారే ఇప్పుడు అధిక ధరల కారణంగానే వసూళ్లు రావడం లేదని అంటున్నారని.. కనుక టిక్కెట్ల ధరల పెంపు అనేది పరిష్కారం కాదని.. అందరం కూర్చుని చర్చించుకుని సమస్యలను పరిష్కారం చేసుకోవాలని విష్ణు అన్నారు. అలాగే వచ్చే ఆరు నెలల్లో మా అసోసియేషన్ బిల్డింగ్‌కు భూమి పూజ చేస్తానని స్పష్టం చేశారు. దీంతోపాటు మా సభ్యుల ఆరోగ్యం కోసం కృషి చేస్తానని తెలిపారు.