తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మీద అనుమానంతో ఆమెను ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేశాడు. అందరూ చూస్తుండగానే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మంగను స్థానికంగా ఉంటున్న ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే మంగ నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గోపాల్ రెడ్డి దంపతులు తమ రెండో కుమార్తె స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. వీరి కాపురం గత ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా సాగింది. ఈ క్రమంలోనే వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు.
అయితే గత కొంత కాలంగా స్వప్నపై ఎల్లారెడ్డికి అనుమానం ఏర్పడింది. తన భార్య ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతను అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆ అనుమానం పెరిగి పెద్దదైంది. ఆదివారం సాయంత్రం తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న స్వప్నపై ఎల్లారెడ్డి దాడి చేశాడు. ఐరన్ రాడ్‌తో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని కోసం గాలిస్తున్నారు.