Moped : డబ్బులు ఉన్నా.. లేకపోయినా.. భార్యాభర్తల అనుబంధం అంటే అంతే. అది విడదీయరానిది. భర్త కోసం భార్య.. భార్య కోసం భర్త.. శ్రమించాల్సిందే. అవును.. సరిగ్గా ఇలా అనుకున్నాడు కాబట్టే.. ఎట్టకేలకు భార్యను సంతోష పెట్టగలిగాడు. తాను అనుకున్నది నెరవేర్చాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది.. అన్న వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని చిండ్‌వారా జిల్లాకు చెందిన సంతోష్ సాహు, అతని భార్య మున్నిలు బిచ్చమెత్తి బతుకుతుంటారు. వారికదే ఆధారం. ఆ ప్రాంతంలోని అన్ని చోట్లా బిచ్చమెత్తుకుని రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు సేకరిస్తుంటారు. అయితే కొన్ని సార్లు వాతావరణ పరిస్థితులు, రోడ్ల ప్రభావం వల్ల వారు బిచ్చమెత్తుకోలేకపోతున్నారు. దీంతో సంతోష్ సాహు ఎలాగైనా సరే తన భార్య కోసం ఓ మోపెడ్ కొనాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన నిర్ణయాన్ని అమలు పరిచాడు.

తమకు రోజుకు ఎలాగూ రూ.300 నుంచి రూ.400 వస్తాయి కనుక వాటిని ఖర్చు పెట్టకుండా సంతోష్ సాహు చాలా పొదుపుగా వాడుకున్నాడు. అలా అతను నాలుగేళ్ల పాటు బిచ్చమెత్తి రూ.90వేలు కూడబెట్టాడు. దాంతో మూడు చక్రాలు కలిగిన ఓ మోపెడ్‌ను కొన్నాడు. సంతోష్ దివ్యాంగుడు కనుక తనకు అనువుగా ఉండే మోపెడ్‌ను కొన్నాడు. ఈ క్రమంలోనే దానిపై తన భార్య మున్నిని ఎక్కించుకుని ఇప్పుడు మరింత సులభంగా బిచ్చమెత్తుకుంటున్నారు. కాగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
బిచ్చమెత్తుకునే వ్యక్తి అంత డబ్బు ఎలా కూడబెట్టగలడని కొందరు అంటుంటే.. వారి వివరాలు కనుక్కుంటే అందరం సహాయం చేయవచ్చు కదా.. అని ఇంకొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే వారి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.