Liger : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గురువు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. యూఎస్ షెడ్యూల్‌లో మైక్ టైసన్ జాయిన్ కాగా, ఆయనతో కలిసి లైగర్ టీం ఫుల్ ఖుష్ అవుతోంది.
అమెరికా షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ, మైక్‌టైసన్‌పై ముఖ్య పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. ఆయనతో తీయించుకున్న ఓ ఫొటోను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
‘టైసన్‌తో గడుపుతున్న ప్రతి నిమిషాన్ని గొప్ప జ్ఞాపకాలుగా భద్రపరచుకుంటున్నా. ఆయన ప్రేమకు నిర్వచనం. ఈ ఫొటో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. లైగర్ వర్సెస్ లెజెండ్..’ అంటూ ఫొటోపై వ్యాఖ్యానించారు.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై కరణ్‌జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ సినిమాకు అది బోనస్ అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు.