Konidela Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య కొణిదెల ఉపాసనకు మెగా కోడలు అన్న బిరుదు ఉండనే ఉంది. అయినప్పటికీ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఎల్లప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె నిమగ్నమవుతుంటారు. ఓ వైపు అపోలో హాస్పిటల్‌కు చెందిన బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఉపాసన సామాజిక సేవ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
కొణిదెల ఉపాసన పేదలకు ఎక్కువగా సహాయం చేస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్ విషయాలను, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమెకు మూగ జీవాలపై ప్రేమ కూడా ఎక్కువే. అందుకనే సోషల్ మీడియాలోనూ జంతు సంరక్షణ గురించి ఆమె చెబుతుంటారు. ఇక తాజాగా కొణిదెల ఉపాసన చేసిన పనికి అందరూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉపాసన వాటిని దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు వాటి సంరక్షణ బాధ్యతలు, ఆహార ఖర్చులను ఆమే స్వయంగా చూసుకోనున్నారు. అందుకుగాను జూ సిబ్బందికి రూ.2 లక్షల చెక్కును ఆమె అందజేశారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ఉపాసన చేస్తున్న మంచి పనికి ఆమెను అందరూ అభినందిస్తున్నారు.
ఇక ఉపాసన గతంలోనూ రాణి అనే ఓ ఏనుగును దత్తత తీసుకున్నారు. దాని సంరక్షణకు ఆమె రూ.5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఈ సింహాలను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూలో 2000 జంతువులు ఉన్నాయని, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన ఉందని, అందుకనే తన వంతుగా సింహాలను దత్తత తీసుకున్నానని తెలియజేశారు. ఏది ఏమైనా.. ఉపాసన గురించిన ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.