Kajal Aggarwal : మెగా ఫ్యామిలీ హీరోలలో దాదాపు అందరు హీరోలతోనూ నటించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు ఆచార్యలో కథానాయికగా నటిస్తోందని, పూజా హెగ్డె సపోర్టింగ్ రోల్‌లో నటిస్తుందని ప్రకటించారు. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. కానీ అందులో తొలుత హీరోయిన్ గా అనుకున్న కాజల్ అగర్వాల్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో రిలీజ్ అయిన లాహే.. లాహే.. సాంగ్ లో కాజల్ అగర్వాల్ సందడి చేసింది. కానీ ట్రైలర్‌లో మాత్రం ఈ అమ్మడు కనిపించలేదు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె పేరును ఎవరూ ఎత్తలేదు.

ఈ క్రమంలో అసలు సినిమాలో కాజల్ పాత్ర ఉంటుందా ? లేదా ? అనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడడుతూ ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు. ధర్మస్థలిలో ఓ అమ్మాయి పాత్రకు కాజల్‌ను తీసుకున్నాం. కాజల్‌పై షూట్ కూడా చేశాం. అయితే హీరో పాత్ర నక్సలిజం నేపథ్యంలో ఉండగా, ఆ పాత్రకు హీరోయిన్ ఉంటే బాగుంటుందా అనిపించింది. అంతేకాక సదరు పాత్రకు పాటలు కూడా లేవు.
ముగింపు సరిగా ఉండదు. అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగోదు అనిపించింది. అదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే, కథకు ఏది అవసరం అయితే అది చేయ్ అన్నారు. కాజల్‌కి కూడా ఇదే విషయం అర్ధం అయ్యేలా చెప్పా. అప్పుడు ఆమె అర్ధం చేసుకుంది. తప్పకుండా ఫ్యూచర్‌లో కలిసి సినిమా చేద్దామని చెప్పింది. అలా కాజల్ పాత్రను ఆచార్య సినిమా నుంచి తొలగించాం.. అన్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఆయన మాటలతో అందరికి ఓ క్లారిటీ అయితే వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఆచార్య సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.