IPL 2022 : ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నీ 8వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగానే ఛేదించింది. దీంతో పంజాబ్‌పై కోల్‌కతా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే పంజాబ్ జట్టు 18.2 ఓవర్లలోనే 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో భానుక రాజపక్స (31 పరుగులు) మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. కోల్‌కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా టిమ్ సౌతీ 2 వికెట్లు తీశాడు. శివమ్ మావి, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లను కోల్పోయి 141 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లలో ఆండ్రూ రస్సెల్ (70 పరుగులు నాటౌట్) అద్భుతంగా రాణించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2 వికెట్లు తీయగా కగిసో రబాడా, ఓడియన్ స్మిత్‌లు చెరొక వికెట్ తీశారు.