iPhone 14 : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నూతన ఐఫోన్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ మోడల్స్ విడుదలయ్యాయి. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లలో లభ్యమవుతున్న ఫీచర్లతోపాటు వీటి ధరలు ఎలా ఉన్నాయి.. ఈ ఫోన్లు ఎప్పటి నుంచి లభ్యమవుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 14, 14 ప్లస్ ఫీచర్లు..
ఈ రెండు ఫోన్లలోనూ డిస్‌ప్లే మాత్రమే వేరేగా ఉంది. మిగిలిన ఫీచర్లన్నీ ఒకే విధంగా ఉన్నాయి. ఐఫోన్ 14 డిస్‌ప్లే సైజ్ 6.1 ఇంచులు కాగా.. ఐఫోన్ 14 ప్లస్ డిస్‌ప్లే సైజ్ 6.7 ఇంచులుగా ఉంది. ఇక వీటిల్లో ఐఫోన్ 13 మోడల్స్ లో వచ్చిన యాపిల్ ఎ15 బయానిక్ చిప్‌సెట్‌నే అందిస్తున్నారు. కాకపోతే పలు మార్పులు చేశారు. ఇక రెండు ఫోన్లు కూడా సెరామిక్ షీల్డ్ గ్లాస్‌ను కలిగి ఉన్నాయి. దీని వల్ల డిస్‌ప్లేకు మంచి రక్షణ లభిస్తుంది. ఈ ఫోన్లు 128, 256, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో విడుదలయ్యాయి. వీటిల్లో ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ను అందిస్తున్నారు. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది.

ఈ రెండు ఫోన్లలో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఒకటి నానో సిమ్, ఒకటి ఇ-సిమ్‌గా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లలో వెనుక వైపు 12 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉంటాయి. ముందు వైపు ఇంకో 12 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. 5జి, బ్లూటూత్ 5.3, అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్, ఎన్ఎఫ్‌సీ, వైఫై 6 వంటి ఫీచర్లతోపాటు శాటిలైట్ ఎమర్జెన్సీ కనెక్టివిటీ, కార్ క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను కూడా ఈ ఫోన్లలో అందిస్తున్నారు.
ఐఫోన్ 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్ ఫీచర్లు..
ఐఫోన్ 14, 14 ప్లస్‌లలో ఉన్న ఫీచర్లే వీటిల్లోనూ ఉన్నాయి. కానీ ఈ ఫోన్లలో కొత్తగా యాపిల్ ఎ16 బయానిక్ చిప్ సెట్ లభిస్తుంది. ఇక డిస్‌ప్లే సైజ్‌లు ఐఫోన్ 14, 14 ప్లస్ ల మాదిరిగానే 6.1, 6.7 ఇంచులుగా ఉన్నాయి. ఇక వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెమెరా ఒకటి ఈ ప్రొ మోడల్స్‌లో అదనంగా వస్తుంది. అలాగే కొత్తగా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్లను ఈ ప్రొ మోడల్స్‌లో అందిస్తున్నారు. దీంతోపాటు ప్రొ మోడల్స్‌లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. ఈ ఫోన్లను కూడా 128, 256, 512జీబీ ఆప్షన్‌లలో అందిస్తున్నారు. దీంతోపాటు ప్రొ మోడల్ ఫోన్లు 1టీబీ ఆప్షన్‌లోనూ అందుబాటులో ఉన్నాయి.
ఇక ఐఫోన్ నూతన మోడల్స్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 14కు చెందిన 128, 256, 512 జీబీ ఫోన్ల ధరలు వరుసగా రూ.79,900, రూ.89,900, రూ.1,09,900 గా ఉన్నాయి. అలాగే ఐఫోన్ 14 ప్లస్‌కు చెందిన 128, 256, 512 జీబీ ఫోన్ల ధరలు వరుసగా రూ.89,900, రూ.99,900, రూ.1,19,900గా ఉన్నాయి.
అలాగే ఐఫోన్ 14 ప్రొకు చెందిన 128, 256, 512జీబీ, 1టీబీ మోడల్ ఫోన్ల ధరలు వరుసగా రూ.1,29,900, రూ.1,39,900, రూ.1,59,900, రూ.1,79,900గా ఉన్నాయి. అలాగే ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌కు చెందిన 128, 256, 512జీబీ, 1టీబీ మోడల్ ఫోన్ల ధరలు వరుసగా రూ.1,39,900, రూ.1,49,900, రూ.1,69,900, రూ.1,89,900గా ఉన్నాయి.
ఇక ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లకు గాను సెప్టెంబర్ 9వ తేదీన సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. ఫోన్లను సెప్టెంబర్ 16వ తేదీ నుంచి విక్రయిస్తారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి అదే రోజు నుంచి డెలివరీ ఇస్తారు. అయితే ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లను మాత్రం అక్టోబర్ 7వ తేదీ నుంచి విక్రయిస్తారు.