బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే మన దేశంలో పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తోంది. దేశంలో పెద్ద ఎత్తున కోవిషీల్డ్ టీకాలను కూడా ప్రజలకు ఇస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో ఇదే టీకా వల్ల కొందరిలో రక్తం గడ్డ కడుతుందని వార్తలు వచ్చాయి. దీంతో ఆయా దేశాల్లో ఈ టీకా పంపిణీని నిలిపివేశారు. ఇక ఆ దేశాల జాబితాలో తాజాగా ఇటలీ వచ్చి చేరింది.
ఇటలీలో మే 25వ తేదీన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న కెమిల్లా కనేపా అనే 18 ఏళ్ల యువకుడు చనిపోయాడు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అతను రక్తం గడ్డకట్టి చనిపోయాడు. దీంతో 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను ఇవ్వకూడదని ఇటలీ నిర్ణయించింది. కేవలం 60 ఏళ్లకు పైబడిన వారికే ఈ టీకాను ఇవ్వనున్నారు.
అయితే సదరు యువకుడు అత్యంత అరుదుగా సంభవించే వ్యాధి వల్ల చనిపోయాడని, వ్యాక్సిన్ వల్ల కాదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇటలీలో మాత్రం 60 ఏళ్ల లోపు వారికి ఇకపై ఈ వ్యాక్సిన్ ఇవ్వొద్దని నిర్ణయించారు. కేవలం 60 ఏళ్లకు పైబడిన వారికే ఇకపై అక్కడ ఆస్ట్రాజెనెకా టీకా ఇస్తారు. అలాగే 60 ఏళ్ల లోపు ఉన్నవారు ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకుని ఉంటే వారికి ఇంకో వ్యాక్సిన్ ను రెండో డోసు కింద ఇవ్వనున్నారు. అనేక యురోపియన్ దేశాల్లో ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకాను నిషేధించడం, ప్రస్తుతం ఇటలీలో కూడా అదే విధంగా చేయడం చర్చనీయాంశమవుతోంది.