Indian Railways : రైళ్లలో ప్రయాణించేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాటిని డిస్పోజబుల్ పద్ధతిలో ఇస్తారు.
ఇకపై రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను, దిండ్లను అందించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు ముందస్తుగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డిస్పోజబుల్ దుప్పట్లు, దిండ్లను ఇస్తారు. మొత్తం ఒక కిట్ రూపంలో వాటిని అందిస్తారు.
రైల్వే శాఖ అందించే కిట్‌లో దుప్పట్లు, దిండుతోపాటు పలు వస్తువులు కూడా ఉంటాయి. ఒక తెలుగు రంగు బెడ్ షీట్, ఒక గ్రే కలర్ బ్లాంకెట్, ఒక దిండు, దిండు కవర్, నాప్ కిన్, మూడు లేయర్లు ఉండే మాస్క్, టూత్ పేస్ట్ వంటివి ఉంటాయి. ప్రయాణికులు రూ.150 చెల్లించి ఈ కిట్‌ను పొంది అందులో ఉండే వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణం ముగిశాక వాటిని పడేయాలి. అయితే ఈ సదుపాయం ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన రైళ్లలోనే ఉంది. కానీ త్వరలోనే మిగిలిన అన్ని రైళ్లలోనూ ఈ సదుపాయాన్ని అందివ్వనున్నారు.