వర్షాలు పడేటప్పుడు ఉరుములు, మెరుపులు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో అలాంటి పరిస్థితిలో ఆరు బయట ఎవరైనా ఉంటే వారిపై పిడుగులు పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎత్తైన నిర్మాణాలు, వృక్షాలపై పిడుగులు పడుతుంటాయి. కానీ అస్సాంలో పిడుగులు పడడం వల్ల ఒకేసారి ఏకంగా 18 ఏనుగులు చనిపోయాయంటూ ప్రచారం జరుగుతోంది. ఏనుగులు చనిపోయిన మాట వాస్తవమే కానీ.. అందుకు పిడుగులే కారణమా, ఇంకేదైనా ఉందా ? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అస్సాంలోని బాముని కొండ ప్రాంతంలో కొందరికి 18 ఏనుగుల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేయగా వారు అలర్ట్ అయ్యి ఏనుగుల కళేబరాలను పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఒకేసారి అంత ఎక్కువ సంఖ్యలో ఏనుగులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏనుగుల మరణం వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
అయితే ఏనుగులు చనిపోయేందుకు పిడుగులు పడడమే కారణమని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇది నమ్మశక్యంగా లేదని జంతు ప్రేమికులు అంటున్నారు. అయితే నిజానికి ఏనుగులు, జిరాఫీల వంటి భారీ జంతువులపై పిడుగులు పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక చోట పిడుగు పడితే అక్కడికి సమీపంలోని జంతువులకు భూమి గుండా విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుందని, అలాంటి స్థితిలోనూ ఆ జంతువులు చనిపోతాయని అంటున్నారు.
ఇక ఏవైనా ఎత్తయిన వస్తువులపై పిడుగులు పడినప్పుడు వాటిని పట్టుకుని ఏవైనా జంతువులు ఉంటే అవి చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలిపారు. కానీ ఏనుగుల మృతికి పిడుగులే కారణమా అనే విషయం తెలియలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.