ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరం అవుతోంది. గత రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా మూడు లక్షలను దాటడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు నమోదు కాని విధంగా రెండవ దశలో గరిష్ట స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రానున్న రోజులలోఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత దేశంలో కరోనా ఉద్ధృతి ఈ విధంగానే కొనసాగితే మే ప్రథమార్థంలో రోజుకు దాదాపు 10 లక్షల పాజిటివ్ కేసులు.. 5000 మరణాలు సంభవించవచ్చు అని మిచిగన్ యూనివర్సిటీ అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ భ్రమర్ ముఖర్జీ హెచ్చరించారు. ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆధారంగా ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఈవేల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో ఆమె వివరించారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఎక్కడికక్కడ లాక్ డౌన్ నిబంధనలు పాటించడం, మాస్కులు ధరించడం,సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించినప్పుడే ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చుని ఆమె తెలిపారు. ఎంతో క్లిష్ట పరిస్థితులలో ఉన్న భారతదేశానికి అంతర్జాతీయ సహాయ సహకారం అవసరం.ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలి.. మే మధ్యనాటికి రోజుకు 8-10 లక్షల కేసులు, 5 వేల మరణాలు నమోదుకావచ్చు.మే చివరి వరకూ ఇది కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.