దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మృత్యుహేల కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజుకు 300కు పైగా మంది కరోనా వల్ల చనిపోతున్నారు. దీంతో శ్మశానవాటికల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మృతదేహాలను తీసుకు వచ్చి దహనం చేస్తున్నారు. భారీ సంఖ్యలో మృతదేహాలు వస్తుండడంతో వాటిని దహనం చేసేందుకు సమయం పడుతోంది. దీంతో మృతదేహాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు శ్మశానవాటికల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ఢిల్లీలో సోమవారం ఒక్క రోజే 380 మంది చనిపోయారు. ఆదివారం 350, శనివారం 357 మంది చనిపోయారు. ఈ క్రమంలో ఢిల్లీలో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 14,628కి చేరుకుంది. అక్కడ రోజూ కొత్తగా 20వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే 20,201 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. పాజిటీవిటీ రేటు 35.02 శాతంగా ఉంది. 92,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రోజూ భారీ సంఖ్యలో మృతదేహాలు వస్తుండడంతో శ్మశానవాటికల్లో స్థలం చాలడం లేదు. దీంతో శ్మశానాల నిండా వీలున్నంత మేర స్థలాలను ఏర్పాటు చేసి దహనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఏ శ్మశానవాటికను చూసినా అత్యంత హృదయ విదారకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లనైతే శ్మశానవాటికల్లో స్థలం సరిపోక అక్కడే రహదారుల పక్కన, పార్కింగ్ ప్రదేశాల్లోనూ దహనకాండలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముందు ముందు పరిస్థితి ఇంకెంత ఆందోళనకరంగా మారుతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.