దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం అన్ని ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నప్పటికీ రోజు సగటున లక్ష కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో రోజుకు సగటున లక్ష కేసులు నమోదవుతున్నాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) నిపుణుడు డాక్టర్ గిరిధర్ బాబు తెలిపారు.
ఉత్తరాది రాష్ట్రాలలో ఈ మహమ్మారి కట్టడి చేయడానికి పటిష్ట చర్యలు తీసుకోకపోతే రోజుకు ఒక రాష్ట్రంలో లక్ష కేసులు వరకు నమోదు అవుతాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ విధంగా పలు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరగటానికి గల కారణం కేవలం నిర్లక్ష్యమేనని నిపుణులు భావిస్తున్నారు.గత కొంతకాలం నుంచి కరోనా సోకిన ఒక వ్యక్తి ఎంతమందికి కరోనా అంటించగలరనే విషయంపై పలు అధ్యయనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక కరోనా సోకిన వ్యక్తి దాదాపు ముగ్గురికి కరోనా అంటించగలరని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత వరకు కరోనా కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.