ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరోనా పరిస్థితులను కట్టడి చేయడం కోసం పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ విధించారు. ఈ క్లిష్ట సమయంలో యాదగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న తన కూతురిని తన భుజాలపై ఎక్కించుకొని ఎనిమిది కిలోమీటర్ల నడుస్తూ తన కూతురికి వైద్యం చేయించిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో రోజురోజుకు కేసులు అధికమవుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మూడు రోజుల పాటు లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో యాదగిరి జిల్లా మొత్తం పోలీసులు కఠినంగా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ పనులు, ఒంటరిగా ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. యాదగిరి తాలుకాలోని పగలాపూర గ్రామానికి చెందిన మారెప్ప అనే వ్యక్తి కూతురికి జ్వరంగా ఉండటంతో.. అతడు ఆస్పత్రిలో చూపించేందుకు యాదగిరి నగరానికి తీసుకువెళ్లాలి.
పగలాపూర గ్రామం నుంచి యాదగిరికి వెళ్ళాలి అంటే ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ప్రస్తుతం జిల్లా మొత్తం లాక్ డౌన్ అమలులో ఉండటంతో బండి పై వెళితే పోలీసులు ఎక్కడ బండిని పట్టుకుంటారేమో నన్న భయంతో జ్వరంతో బాధపడుతున్న తన కూతుర్ని మారెప్ప భుజాలపై ఎక్కించుకొని ఏకంగా ఎనిమిది కిలోమీటర్ల నడుస్తూ యాదగిరికి చేరుకుని అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తన కూతురుకు చికిత్స చేయించి తిరిగి పగలాపూర గ్రామానికి తన కూతురిని మోసుకుంటూ కాలినడకన చేరుకున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.