దేశంలో కోవిడ్ రెండో వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మూడో వేవ్‌పై దృష్టి పెట్టాయి. మూడో వేవ్‌లో ఎక్కువగా చిన్నారులకు కోవిడ్ ప్రమాదం ఉండే అవకాశం ఉందని తెలుస్తుండడంతో చిన్నారులకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లను సిద్ధం చేస్తున్నారు. వారి కోసం ఐసీయూ బెడ్లను, ఇతర సదుపాయాలను పెంచుతున్నారు. అయితే కోవిడ్ నుంచి చిన్నారులను రక్షించేందుకు గాను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
చిన్నారులకు కోవిడ్ సోకినప్పటికీ వారిలో అంత తీవ్రత ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. చాలా మందికి స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో కోవిడ్ సోకుతుంది కనుక వారిని ఇంట్లోనే ఉంచి చికిత్సను అందించవచ్చు. కానీ ఊబకాయం, టైప్ 1 డయాబెటిస్, క్రానిక్ కార్డియో పల్మనరీ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండే చిన్నారులకు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటి వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
చిన్నారులు కచ్చితంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. వారిచే మాస్కులను ధరింపజేయాలి. భౌతిక దూరంపై అవగాహన కల్పించాలి. చేతులను ఎల్లప్పుడూ శుభ్రం చేసుకునేలా పర్యవేక్షించాలి. చిన్నారులను ఇంట్లో నుంచి బయటకు పంపించకూడదు. ఇండోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. బయట పిల్లలతో తిరగనివ్వకూడదు. ఇంట్లో వృద్ధులు ఉంటే పిల్లల ద్వారా వారిక కోవిడ్ సోకే ప్రమాదం ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. వృద్ధులకు పిల్లలను దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి.
చిన్నారుల్లో ఏవైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్సను అందించాలి. వారికి పౌష్టికాహారం ఇవ్వాలి. గోరువెచ్చని నీటిని తాగించాలి. ప్రాణాయం, ధ్యానం చేసేలా ప్రోత్సహించాలి. పసుసు కలిపిన పాలు, చ్యవన్ ప్రాశ్ రోజూ ఇవ్వాలి. జంక్ ఫుడ్‌ను మానేసే విధంగా చూడాలి. ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్ బారి నుంచి చిన్నారులను రక్షించవచ్చు.