కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న వారు ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం విదితమే. వైద్య నిపుణులు కూడా ఈ టెక్నిక్‌ను పాటించాలని బాధితులకు సూచిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ 82 ఏళ్ల వృద్ధురాలు కూడా ఈ టెక్నిక్ సహాయంతోనే కోవిడ్‌ను జయించింది.
సదరు మహిళ కోవిడ్ బారిన పడగా ఆమె ఇంట్లో ఉండి చికిత్స తీసుకోసాగింది. అయితే ఆమె ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. 79కి చేరుకున్నాయి. అయినప్పటికీ ఆమె తన కుమారులు, డాక్టర్లు సూచించిన విధంగా ప్రోనింగ్ టెక్నిక్‌ను పాటించింది. అలా 12 రోజుల పాటు రోజూ ఈ టెక్నిక్‌ను అనుసరించింది. దీంతోపాటు పౌష్టికాహారం తీసుకుంది. ఈ క్రమంలో ఆమె కోవిడ్ నుంచి బయట పడింది. ఆమెకు మొదటి నాలుగు రోజుల్లోనే ఆక్సిజన్ స్థాయిలు 94కు పెరిగాయని, ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయిలు 97గా వస్తున్నాయని డాక్టర్లు తెలిపారు.
ప్రోనింగ్ టెక్నిక్‌ను పాటిస్తే కోవిడ్ బాధితుల శరీరాల్లో ఆక్సిజన్ స్థాయిలు మెరుగు పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోర్లా పడుకుని గొంతు కింద ఒకటి, పొట్ట కింద ఒకటి, కాళ్ల కింద ఒకటి దిండు చొప్పున పెట్టుకుని శ్వాస తీసుకోవాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. చేసినప్పుడల్లా సౌకర్యాన్ని బట్టి 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రోనింగ్ పొజిషన్‌లో ఉండాలి. దీంతో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల ఆక్సిజన్ స్థాయిలు 95 వరకు చేరుకుంటాయని వైద్యులు తెలిపారు.