IND Vs ENG : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగతున్న 5వ టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. భారత ఇన్‌చార్జి కెప్టెన్ బుమ్రా ఇంగ్లండ్‌పై విరుచుకు పడ్డాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాడు. దీంతో బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డును బుమ్రా బద్దలుకొట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బుమ్రా ఊచకోత కోశాడు. మొదటి బంతికి ఫోర్ కొట్టగా, రెండో బంతికి 5 వైడ్లు లభించాయి.
మూడో బంతికి నో బాల్ వేయగా.. దానికి బుమ్రా సిక్స్ కొట్టాడు. ఆ తరువాత 3 బంతులకు వరుసగా ఒక్కోదానికి ఒక్కో 4 లభించింది. తరువాత 5వ బంతికి సిక్స్ సాధించాడు. చివరి బంతికి సింగిల్ వచ్చింది. ఇలా ఒకే టెస్టు ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా బుమ్రా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా ఒక టెస్టు ఓవర్‌లో 28 పరుగులు సాధించగా.. బుమ్రా 35 పరుగులతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో లారా స్వయంగా ట్వీట్ ద్వారా బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపాడు.

ఇక టెస్టు విషయానికి వస్తే.. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్, మిడిల్ ఆర్డర్ విఫలం చెందగా.. లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఆదుకున్నారు. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ రిషబ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 104 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఇక ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి క్లిష్ట స్థితిలో ఆటను కొనసాగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 84/5 వద్ద ఉండగా.. జాక్ లీచ్, బెన్ స్టోక్స్‌లు క్రీజులో ఉన్నారు.
https://twitter.com/CricCrazyJohns/status/1543184486170775552