ICC Under 19 World Cup 2022 : అండర్-19 క్రికెట్‌లో భారత్ సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్ అండర్-19 జట్టు ఈసారి కూడా కప్ కోసం ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే సెమీస్ చేరుకున్న భారత్ బుధవారం సాయంత్రం ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌లో తలపడనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గత రెండు అండర్ 19 వరల్డ్ కప్‌లలో భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండు సార్లు నాకౌట్ మ్యాచ్‌లలో తలపడ్డాయి. అయితే రెండు సార్లూ భారత జట్టే గెలిచింది. దీంతో భారత్ ఫేవరెట్‌గా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. 2018 అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో పృథ్వీ షా కెప్టెన్సీలోని భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఇక 2020లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. దీంతో బుధవారం జరగనున్న మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధిస్తుందని అంటున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వరుసగా నాలుగోసారి వరల్డ్ కప్ ఫైనల్స్‌లోకి ప్రవేశించినట్లు అవుతుంది. ఈ క్రమంలోనే భారత్, ఆస్ట్రేలియాల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2022 మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ చానల్స్‌లో ప్రసారం అవుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం సాయంత్రం 6.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.