Laila : ఒకప్పటి హీరోయిన్లు రీ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. ఓ టైములో తమ గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లు తర్వాత పలు కారణాల వల్ల సినీ పరిశ్రమకి దూరమవ్వడం.. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడం జరుగుతూనే ఉంది. ఈ లిస్ట్ లో ఒకప్పటి హీరోయిన్ లైలా కూడా ఉంది. ఈమె తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఎగిరే పావురమా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లైలా మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించింది కానీ తెలుగులో చేయలేదు. అయితే ప్రస్తుతం కార్తీ నటిస్తున్న సర్ధార్ అనే మూవీలో లైలా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుందట. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగులో కూడా డబ్ కానుంది. అభిమన్యుడు వంటి హిట్ చిత్రాన్ని అందించిన పి.ఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ మూవీలో కార్తీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అయితే దాదాపుగా 15 ఏళ్ల తరువాత ఈ సినిమా ద్వారా హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇస్తుంది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా లైలా మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఈ మూవీలో నా పాత్ర ఉంటుందని చెప్పగలను. నా కెరీర్‌లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల కోసం ఎప్పుడూ తపన ఉండేది. సర్దార్ తో ఖచ్చితంగా ఆ కోరిక తీరింది. ఇప్పటి హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా పెర్ఫార్మన్స్ కు ఆస్కారం ఉన్నవి కూడా చేయడంపై సంతోషం వ్యక్తం చేసింది లైలా. డైరెక్టర్ మిత్రన్ గురించి మాట్లాడుతూ.. ఇది ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ అని అతన్ని ప్రశంసించింది. సర్ధార్ మూవీ ఈ నెల 21 విడుదల కానుంది.