RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉంది. కానీ అనేక కారణాలచే వాయిదా పడుతూ వచ్చింది. ఇక గడిచిన సంక్రాంతికి అయినా ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ కరోనా వల్ల ఈ చిత్రం విడుదల మళ్లీ వాయిదా పడింది. అయితే మేకర్స్ ఎట్టకేలకు ఓ కొత్త తేదీని ప్రకటించారు.

మార్చి 25, 2022వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో అటు చరణ్ ఫ్యాన్స్, ఇటు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు విడుదలవుతాయని భావించినా ఆర్ఆర్ఆర్ కారణంగా వాటిని వాయిదా వేశారు. అయితే కనీసం ఆర్ఆర్ఆర్ సినిమా అయినా విడుదలవుతుందా.. అని వేచి చూశారు. కానీ అది కూడా జరగలేదు. సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే ఎట్టకేలకు అతి త్వరలోనే ఈ మూవీ విడుదలవుతుండడం ఫ్యాన్స్‌కు సంతోషం కలిగిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా.. అని ఆతృతతో వేచి చూస్తున్నారు.
RRR Movie : మార్చి 25వ తేదీన విడుదల..
ఇటీవల ఈ సినిమాను విడుదల చేసేందుకు రెండు తేదీలను అనుకున్నారు. మార్చి 18, ఏప్రిల్ 28 తేదీల్లో మూవీని విడుదల చేయాలని భావించారు. కానీ చివరకు అన్ని చర్చల అనంతరం సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. దీంతో ఆర్ఆర్ఆర్ కు ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా అలరించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ మూవీని తెలుగుతోపాటు తమిళం, మళయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.