Ganesh Murugan : మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక మంది అనేక రకాల మనస్తత్వాలతో ఉంటారు. కొందరు తాము చేస్తున్న పని నచ్చడం లేదని చెబుతుంటారు. ఇక కొందరు తమకు నచ్చిన పని దొరకడం లేదని ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా కొందరు జులాయిగా తిరుగుతూ ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ జల్సాలు చేస్తుంటారు. ఇలా అనేక రకాల వ్యక్తులు మనకు తారస పడుతుంటారు. అయితే ఇలాంటి వారందరికీ అతను ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రమాదం కారణంగా కాళ్లు పనిచేయకపోయినా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. తనకు దొరికిన పని చేస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
చెన్నైకి చెందిన గణేష్ మురుగన్ వయస్సు 37 ఏళ్లు. అతను జొమాటోలో ఫుడ్ డెలివరీ చేస్తూ కాలం వెళ్లదీస్తుండేవాడు. అయితే ఒకసారి ట్రక్కు ఢీకొని అతని వెన్నెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో కింది భాగం మొత్తం పనిచేయకుండా పోయింది. అతని కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేకపోయాడు. ఇది 6 ఏళ్ల కిందట జరిగింది.

అయితే అంతటి ప్రమాదం బారిన పడి నడవరాకుండా అయిపోయినా.. అతను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. కష్టపడి పనిచేసేందుకు నడుం బిగించాడు. అందులో భాగంగానే ఐఐటీ మద్రాస్ వారి సహకారంతో ఒక వీల్ చెయిర్‌ను తీసుకుని దాంతో ఫుడ్ డెలివరీలు చేయడం మొదలు పెట్టాడు. ఆ వీల్ చెయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లా పనిచేస్తుంది. అందులో బ్యాటరీ ఉంటుంది. నాలుగు గంటల పాటు చార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు వెళ్లవచ్చు.
ఇలా గణేష్ తాను వైకల్యం బారిన పడ్డాననే బాధ లేకుండా తన కాళ్లపై తాను నిలబడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలా మంది నచ్చిన పని దొరకడం లేదని సమయాన్ని, వయస్సును వృథా చేసుకుంటుంటారు. అలాగే కొందరు జల్సాలు చేస్తూ తిరుగుతుంటారు. అలాంటి వారందరికీ గణేష్ ప్రేరణగా నిలుస్తున్నాడు. కష్టపడి పనిచేయాలనే తపన ఉండాలే కానీ ఏ పని అయినా చేయవచ్చని.. అందుకు శరీర వైకల్యం కూడా అడ్డుకాదని అతను నిరూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని స్టోరీ తెలిసిన వారు కన్నీళ్లు పెడుతున్నారు. అతన్ని అభినందిస్తున్నారు. నెటిజన్లు అతన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే అతని స్టోరీ వైరల్ అవుతోంది.