Farmer : ప్రధాని నరేంద్ర మోదీ 2014 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద వ్యక్తికి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు. అయితే ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ పేదలకు జన్ ధన్ ఖాతాలను మాత్రం ఓపెన్ చేయించారు. అలాంటి ఓ వ్యక్తికి చెందిన జన్ ధన్ ఖాతాలో గత కొద్ది నెలల క్రితం రూ.15 లక్షలు పొరపాటున జమ అయ్యాయి. అయితే అందులోంచి రూ.9 లక్షలను ఆ వ్యక్తి ఖర్చు పెట్టగా.. బ్యాంకు వారు ఇప్పుడు మేల్కొని ఆ డబ్బును వెనక్కి ఇచ్చేయాలని కోరుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పైథక్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ ఓటె అనే రైతుకు స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో జన్ ధన్ ఖాతా ఉంది. అయితే కొన్ని నెలల కిందట బ్యాంకు వారు అక్కడి పింపల్‌వాడి అనే గ్రామానికి చెందిన పంచాయతీ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయాల్సింది పోయి పొరపాటున జ్ఞానేశ్వర్ ఖాతాకు ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు.
అయితే ఆ డబ్బు పొరపాటున ట్రాన్స్ ఫర్ అయి నెలలు గడుస్తున్నా బ్యాంకు వారు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక ఆ రైతు తన ఖాతాలో రాత్రికి రాత్రే రూ.15 లక్షలు ఉండడం చూసి షాకయ్యాడు. నెలలు గడుస్తున్నా.. ఎవరూ అతన్ని సంప్రదించలేదు. దీంతో అతను ఆ డబ్బును ప్రధాని మోదీయే నల్లధనం పథకం కింద వేయించారని అనుకుని అందులోంచి రూ.9 లక్షలను విత్‌డ్రా చేసి ఇంటిని నిర్మించుకున్నాడు. అలాగే తనకు రూ.15 లక్షలను ఇచ్చినందుకు మోదీకి థ్యాంక్స్ చెబుతూ ఓ లేఖ కూడా రాశాడు.
ఇక తాజాగా ఆ బ్యాంకు వారు ఆడిటింగ్ నిర్వహించగా అసలు విషయం బయట పడింది. సదరు మొత్తం ఆ గ్రామ పంచాయతీ ఖాతాకు కాకుండా ఆ రైతు ఖాతాకు పొరపాటున బదిలీ అయిందన్న విషయం తెలుసుకుని ఖంగు తిన్నారు. వెంటనే ఆ రైతు ఖాతాలో ఉన్న రూ.6 లక్షలను వెనక్కి తీసుకున్నారు. ఇక మిగిలిన రూ.9 లక్షల కోసం ఆ రైతును వేడుకుంటున్నారు. ఎలాగైనా సరే ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని.. లేకపోతే తమ ఉద్యోగాలు పోతాయని కోరుతున్నారు. ఇక ఆ రైతు మాత్రం తనకు ప్రధాని మోదీ నల్లధనం పథకం కింద ఆ డబ్బు వేశారని చెబుతున్నాడు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.