F3 Trailer : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు ప్రధాన పాత్రల్లో.. ఎఫ్2కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం.. ఎఫ్3. ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితమే లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎఫ్2 ద్వారా ఎంటర్‌టైన్ చేసిన చిత్ర బృందం ఎఫ్3 ద్వారా డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. కాగా ఎఫ్2తో పోలిస్తే ఎఫ్3లో కామెడీ ఒక రేంజ్‌లో ఉంటుందని అర్థమవుతోంది. ట్రైలర్‌ను చూస్తేనే కడుపుబ్బా నవ్వు వస్తుందని.. ఇంకా సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మూవీని దిల్ రాజు నిర్మించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

తనదైన శైలిలో కామెడీ సీన్లను తీయడంలో అనిల్ రావిపూడి పెట్టింది పేరు. అందులో భాగంగానే ఎఫ్2 బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఎఫ్3 ట్రైలర్‌ను చూస్తుంటే దాని కన్నా రెట్టింపు వినోదం ప్రేక్షకులకు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని సీన్లలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు అద్భుతంగా కామెడీని పండించారు. ఒక సీన్‌లో వెంకీ తమది దగ్గుబాటి ఫ్యామిలీ అని అంటే.. ఇంకో సీన్‌లో వరుణ్ తేజ్ తమది మెగా ఫ్యామిలీ అని అంటాడు. ఈ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులచే విజిల్స్ కొట్టిస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక ఈ మూవీని ఔట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ మే 27వ తేదీన విడుదల కానుండగా.. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డె ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఇది సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఎఫ్2లో ఎలాగైతే భార్యల ద్వారా భర్తలు ఇబ్బందులు పడ్డారో.. ఇందులోనూ అలాగే చూపించనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమాలో హోటల్ బిజినెస్ పెట్టి భారీగా నష్టపోయిన భర్తలుగా వెంకీ, వరుణ్ తేజ్ లు నటించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.